ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : హైదరాబాద్‌లోని బౌరంపేట్‌లో మిషన్ స్కేటింగ్ అకాడమీ పూణే ఆధ్వర్యంలో నిర్వహించిన 80 నిమిషాల నాన్‌స్టాప్ స్కేటింగ్ ఈవెంట్‌లో వనపర్తి జిల్లాకు చెందిన 32 మంది విద్యార్థులు జాతీయ స్థాయి రికార్డు సాధించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఎటువంటి విరామం లేకుండా స్కేటింగ్ చేసి తమ ప్రతిభను చాటారు.
రికార్డు సాధించిన విద్యార్థులు, కోచ్ రాథోడ్ కిషన్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునితారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయ ఆవరణలో విద్యార్థులు చేసిన స్కేటింగ్ విన్యాసాలను ఎస్పీ తిలకించి ముగ్ధులయ్యారు. చిన్న వయసులోనే క్రమశిక్షణ, పట్టుదలతో జాతీయ రికార్డు నెలకొల్పడం జిల్లాకే గర్వకారణమని ఎస్పీ ప్రశంసించి, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, కోచ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్, ఎస్బీ ఎస్సై మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

