* స్థానిక జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: విదేశీ ఆక్రమణ మొక్కల జాతుల వ్యాప్తిని అడ్డుకుని, వాటిని నిర్మూలించడం ద్వారా స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో విదేశీ కలుపు మొక్కల నిర్మూలనపై అవగాహన, గుర్తింపు కార్యక్రమాన్ని సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. విదేశీ ఆక్రమణ మొక్కల నిర్మూలన ఉద్యమానికి ప్రతీకగా రూపొందించిన ప్రత్యేక “థంబ్స్ డౌన్” సంకేతాన్ని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ విదేశీ మొక్కల జాతుల వ్యాప్తి వల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. వాటి వ్యాప్తిని నియంత్రించడంతో పాటు సాధ్యమైన మేరకు నిర్మూలించి స్థానిక వృక్ష జాతులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
స్థానిక పర్యావరణ వ్యవస్థలను కాపాడటంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. విదేశీ కలుపు మొక్కల గుర్తింపు, నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విదేశీ కలుపు మొక్కల నిర్మూలన, స్థానిక జీవవైవిధ్య పరిరక్షణ, ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కార్యక్రమంలో సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఈకో ఫాన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మెట్టుసాయి సంపత్, రాష్ట్ర సమన్వయకర్త తలారి విక్రమ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

