సిరిసిల్ల: తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఆత్యాచారం కేసులో నిందితుడు జంగపల్లి శ్రీహరికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పుష్పలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన జంగపల్లి శ్రీహరి ఓ యువతిపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం అప్పటి సీఐ ఉపేందర్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ రాజేందర్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, వెన్నెల 9 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. జాన్సీ వాదనలు వినిపించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితుడు జంగపల్లి శ్రీహరికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు.
సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితులకు వరుస శిక్షలు
ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి సిరిసిల్ల సీఐలు సర్వర్, ఉపేందర్, ప్రస్తుత సీఐ నాగేశ్వరరావు, తంగళ్లపల్లి ఎస్‌ఐ అశోక్, పీపీ జాన్సీ, కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్ యాదవ్, కోర్టు కానిస్టేబుల్ రాజేందర్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, వెన్నెలను జిల్లా ఎస్పీ అభినందించారు.
జిల్లా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేసుకుంటూ వేగవంతమైన విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. నేరం చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

