◆ నష్టపరిహారం తీసుకున్నా.. మళ్లీ కెనాల్ భూమిలోనే దుక్కులు
◆ భవిష్యత్ అవసరాలకు భూమి లేకుండా చేస్తున్నారని మాజీ సర్పంచ్ శివరాం రెడ్డి మండిపాటు
◆ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా నాగపూర్, రేవల్లి వైపు వెళ్లే కెనాల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భూమి ఆక్రమణకు గురవుతోందని రేవల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు శివరాం రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. నాగపూర్ గ్రామానికి చెందిన ఎక్కే జమ్ములు అనే రైతుకు చెందిన పొలం కెనాల్ నిర్మించే క్రమంలో ముంపునకు గురైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సదరు రైతుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పరిహారాన్ని అందజేసింది.
అయితే, పరిహారం అందుకున్నప్పటికీ, ఆ రైతు కెనాల్ వెంట ఉన్న భూమిని మరల చదును చేస్తూ, దున్నుతున్నాడని శివరాం రెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంక్షేమ పథకాల భవనాలు లేదా ఇతర ప్రజావసరాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే, ఇప్పుడు ఆక్రమణకు గురవుతున్న భూమి తీవ్ర అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరిహారం పొందిన భూమిని కళ్లముందే చదును చేస్తూ ఆక్రమిస్తుంటే, సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు చూడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కెనాల్ వెంట ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని, ఆక్రమణలను వెంటనే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

