Friday, September 4, 2026

Buy now

కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు

* నైనీ స్ఫూర్తితో.. దేవదుర్గపై ఫోకస్
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్: సింగరేణి సంస్థను బొగ్గు తవ్వకాలకే పరిమితం చేయకుండా కీలక, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాక్‌లో అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

బుధవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి నూతన ప్రాజెక్టులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సంస్థ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో సింగరేణి దక్కించుకున్న దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్‌పై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

దేవదుర్గ బ్లాక్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసేందుకు గురువారం సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి అక్కడ పర్యటించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖనిజ అన్వేషణకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల్లో కర్ణాటక ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం తీసుకుంటామని చెప్పారు.

దేవదుర్గకు ప్రత్యేక ప్రాధాన్యం

దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాక్‌లో ఇప్పటివరకు చేపట్టిన పనులు, భౌగోళిక పరిస్థితులు, ఖనిజ నిక్షేపాల అన్వేషణకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై అధికారులను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

దేవదుర్గ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా బొగ్గు నుంచి కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగంలోకి సింగరేణి విస్తరణకు బలమైన పునాది పడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని మరింత లాభదాయకంగా తీర్చిదిద్ది, భవిష్యత్ తరాలకు బలమైన సంస్థగా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అన్ని ఖనిజ వేలాల్లో పాల్గొనాలి

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సింగరేణి కార్యకలాపాలను విస్తరించాలని భట్టి విక్రమార్క సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే బొగ్గు, కీలక ఖనిజాల వేలం ప్రక్రియలను నిరంతరం అధ్యయనం చేస్తూ సింగరేణికి అనుకూలమైన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆదేశించారు.

త్వరలో వనాడియం, టైటానియం వంటి కీలక ఖనిజ బ్లాక్‌లు వేలానికి వచ్చే అవకాశం ఉన్నందున వాటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని సూచించారు. కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల మైనింగ్ వైపు కూడా సింగరేణి అడుగులు వేయాలని అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఖనిజ అవకాశాలను అధ్యయనం చేసేందుకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ తదితర దేశాల్లోని అవకాశాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించినట్లు తెలిపారు. సింగరేణికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులను గుర్తించి ముందడుగు వేయాలని అధికారులకు సూచించారు.

డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి

ఒకవైపు కీలక ఖనిజాల రంగంలో విస్తరిస్తూనే, మరోవైపు సంస్థ ప్రధాన కార్యకలాపమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్, ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని, ఈ విషయంలో సింగరేణి కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటూనే కీలక ఖనిజాల రంగంలోనూ దేశంలో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related Articles

spot_img

Most Popular