Friday, September 4, 2026

Buy now

సింగరేణి పరిరక్షణకు ఐక్య ఉద్యమం

* 12వ JBCCI వేతన సవరణ కమిటీ సాధన సదస్సు జయప్రదం
* వాటాల పునర్వ్యవస్థీకరణ చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలి
* 12వ JBCCIని ఏర్పాటు చేసి కార్మికులకు లాభాల వాటా అందించాలి

కొత్తగూడెం, ఆగస్టు 25: సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS–BMS) ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ, 12వ JBCCI వేతన సవరణ కమిటీ ఏర్పాటు కోసం నిర్వహించిన సదస్సు మంగళవారం కొత్తగూడెంలోని KCOA క్లబ్‌లో ఘనంగా జరిగింది. యూనియన్ ఉపాధ్యక్షుడు A. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర BMS సంఘటన కార్యదర్శి రామ్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ABKMS కార్యదర్శి P. మాధవ నాయక్, సింగరేణి ST ఉద్యోగుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, BC అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ K.V. ప్రకాష్, OC అసోసియేషన్ అధ్యక్షుడు సోమిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై సదస్సు డిమాండ్లకు మద్దతు తెలిపారు.

సింగరేణి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ

సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యత అని రామ్ మోహన్ అన్నారు. సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జెండాలకు అతీతంగా ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సింగరేణిలో వాటాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్లకు పైగా బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థకు రావాల్సిన నిధులను సకాలంలో అందించి, ఆదాయాన్ని సంస్థ అభివృద్ధికే వినియోగించాలని కోరారు.

సింగరేణి వార్షిక లాభాలను పారదర్శకంగా ప్రకటించి, కార్మికులకు లాభాల వాటా, బోనస్ తదితర ఆర్థిక ప్రయోజనాలను సముచితంగా అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.

బకాయిలతో ఆర్థిక భారం

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో సింగరేణిపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఒత్తిడిని కారణంగా చూపి కార్మికులు, వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలను తగ్గించడం లేదా పరిమితం చేయడం సరికాదన్నారు.సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు.

రాజకీయ జోక్యం, కాంట్రాక్టీకరణను నిలిపివేయాలి

సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిలిపివేయాలని రామ్ మోహన్ డిమాండ్ చేశారు. అధిక రాజకీయ జోక్యం సంస్థ క్రమశిక్షణ, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు.

సంస్థ అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మికుల భవిష్యత్తు కంటే కాంట్రాక్టులు, కాంట్రాక్టు విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. రెగ్యులర్ కార్మికుల భవిష్యత్తును బలహీనపరిచే విధంగా కాంట్రాక్టీకరణ విస్తరించరాదని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బొగ్గు గనులను MDO విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే మైన్ ఆపరేషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

12వ JBCCIని వెంటనే ఏర్పాటు చేయాలి
దేశవ్యాప్తంగా 12వ JBCCI వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు BMS ఆధ్వర్యంలో ఆందోళనలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు P. మాధవ నాయక్ తెలిపారు. 11వ వేతన ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో 12వ JBCCI ఏర్పాటుకు మార్గం సుగమమవుతోందన్నారు.

లేబర్ కోడ్ల కారణంగానే JBCCI ఏర్పాటు కావడం లేదంటూ కొన్ని సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని కార్మికులు నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 12వ JBCCIని వెంటనే ఏర్పాటు చేసి మెరుగైన వేతన ఒప్పందం సాధించే వరకు BMS కార్మికుల పక్షాన పోరాడుతుందని హామీ ఇచ్చారు.

సింగరేణి JBCCI నుంచి బయటకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని, దీనిని కార్మికులు ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సంఘాల మద్దతు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సంఘాల నాయకులు సదస్సులోని అన్ని డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆంటోటి నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, K.V. ప్రకాష్, సోమిరెడ్డి తదితరులు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు, మెరుగైన వేతనాలు, సంస్థ ఆర్థిక పరిరక్షణ కోసం అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

సింగరేణి నష్టపోతే దాని ప్రభావం ప్రధానంగా కార్మికులు, వారి కుటుంబాలపైనే పడుతుందని పేర్కొన్నారు. కార్మిక, ఉద్యోగ సంఘాలు జెండాలకు అతీతంగా కలిసి దీర్ఘకాలిక పోరాటాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.

దీర్ఘకాలిక ఉద్యమానికి పిలుపు

సింగరేణి పరిరక్షణను ఒక్కరోజు కార్యక్రమానికి పరిమితం చేయకుండా దీర్ఘకాలిక ఉద్యమంగా కొనసాగించాలని సదస్సు నిర్ణయించింది. వాటాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్ర ప్రభుత్వ బకాయిల చెల్లింపు, 12వ JBCCI ఏర్పాటు, కార్మికులకు లాభాల వాటా, రాజకీయ జోక్యం నిలిపివేత, కాంట్రాక్టీకరణ నియంత్రణ, సంస్థ స్వయం ప్రతిపత్తి పరిరక్షణ తదితర అంశాలపై భవిష్యత్తులో మరిన్ని ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

కార్యక్రమాన్ని యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ G.V. కృష్ణారెడ్డి నిర్వహించగా, యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ TS పవన్ కుమార్ వందన సమర్పించారు. కొత్తగూడెం రీజియన్ నాయకులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల ఫిట్ సెక్రటరీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

Related Articles

spot_img

Most Popular