* కర్ణాటక క్యాప్టివ్ బొగ్గు గనుల్లో జాయింట్ వెంచర్‌కు సింగరేణి సిద్ధం
* కర్ణాటక ఇంధన మంత్రి కె.జె. జార్జ్‌కు ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* సానుకూలంగా స్పందించిన కర్ణాటక మంత్రి
బెంగళూరు:కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPCL) చేపట్టిన క్యాప్టివ్ బొగ్గు గనుల్లో సింగరేణి సంస్థతో కలిసి జాయింట్ వెంచర్‌గా పనిచేసే ప్రతిపాదనకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కె.జె. జార్జ్‌తో సమావేశమై ఈ ప్రతిపాదన చేశారు.
రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ అభివృద్ధి, బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
* క్యాప్టివ్ గనుల్లో భాగస్వామ్యం
కర్ణాటకలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తగినంత బొగ్గు అందుబాటులో ఉండేలా సింగరేణి, KPCL కలిసి పనిచేయాలని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో KPCL చేపట్టిన క్యాప్టివ్ కోల్ బ్లాకుల్లో సింగరేణికి ఉన్న దీర్ఘకాలిక మైనింగ్ అనుభవాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.
బొగ్గు మైనింగ్‌లో సింగరేణికి సుమారు 137 ఏళ్ల అనుభవం ఉందని, KPCL చేపట్టిన బొగ్గు బ్లాకుల్లో మైనింగ్ కార్యకలాపాలకు సింగరేణి సాంకేతిక నైపుణ్యం ఉపయోగపడుతుందని భట్టి తెలిపారు. అదే సమయంలో కర్ణాటకకు విద్యుత్ రంగంలో ఉన్న అనుభవాన్ని తెలంగాణలో సింగరేణి చేపట్టబోయే పవర్ ప్లాంట్ల నిర్వహణలో వినియోగించుకోవచ్చని చెప్పారు.
ఇరు రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థల పరస్పర సహకారంతో అభివృద్ధి, విస్తరణ లక్ష్యంగా సింగరేణి–KPCL సంయుక్త సంస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కె.జె. జార్జ్ సానుకూలంగా స్పందించారు.
* నిరంతర బొగ్గు సరఫరాకు హామీ
కర్ణాటకలో పారిశ్రామిక ప్రగతి కారణంగా విద్యుత్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని మంత్రి కె.జె. జార్జ్ తెలిపారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ నుంచి బొగ్గును నిరంతరం సరఫరా చేయాలని కోరారు. దీనిపై భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందిస్తూ.. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేటాయింపుల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం సింగరేణి సంస్థ కర్ణాటకకు ఏటా బొగ్గు లింకేజీ ద్వారా 10.54 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. ఇందులో ఎర్రమారుస్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు పూర్తి లింకేజీ ద్వారా 5.24 మిలియన్ టన్నులు, రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్‌కు పాక్షిక లింకేజీ ద్వారా 3.01 మిలియన్ టన్నులు, బళ్లారి యూనిట్-3 థర్మల్ పవర్ ప్లాంట్‌కు 2.29 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.రోజుకు కనీసం నాలుగు రేకుల ద్వారా కర్ణాటకకు బొగ్గు సరఫరా జరుగుతోందని తెలిపారు.
* అధికారుల పాల్గొనడం
సమావేశంలో కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రెటరీ గౌరవ్ గుప్తా, సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, KPCL ఎండీ రాజేంద్ర చోళన్, KPCL ఫైనాన్స్ డైరెక్టర్ నాగరాజు, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న, జీఎం శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

