Friday, September 4, 2026

Buy now

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది

* త్వరలోనే శుభవార్త వస్తుందన్న నమ్మకం ఉంది: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* రెండో పీఆర్సీ, ఓపీఎస్, పెండింగ్ డీఏలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం
* ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో ఇప్పటికే చర్చించా

హనుమకొండ, ఆగస్టు 27: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. సమస్యలపై పోరాడకుండా తప్పించుకుని తిరగడం తనకు అలవాటు లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఇప్పటికే చర్చించిన తర్వాతే ధర్నాకు హాజరయ్యానని తెలిపారు.

ప్రధాన డిమాండ్లపై ఆశాభావం

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన రెండో పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ, పెండింగ్‌లో ఉన్న డీఏల మంజూరు, ఉద్యోగులు–పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే శుభవార్త వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

హెల్త్ కార్డులు, రిటైర్మెంట్‌కు సంబంధించిన సమస్యలతో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందుల పరిష్కారానికి సంబంధిత మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

సమస్యలను దశలవారీగా పరిష్కరిద్దాం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని నాయిని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి సమస్యపై చర్చించేందుకు తాను కూడా ఉద్యోగులతో కలిసి వస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యోగులు వివిధ రాజకీయ పార్టీలకు అభిమానులుగా ఉండవచ్చని, అయితే వారి సమస్యల పరిష్కారం విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ సమన్వయంతో ముందుకు సాగితే సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

తాను ధర్నాకు వచ్చే ముందే ప్రభుత్వ పెద్దలతో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించానని తెలిపారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై చర్చించిన తర్వాతే ధర్నాకు వచ్చానన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశీర్వాదంతో వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.కార్యక్రమంలో TNGOs ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular