Friday, September 4, 2026

Buy now

గణేష్ ఉత్సవాల్లో మత సామరస్యాన్ని కాపాడాలి

* శాంతియుత గణేష్ ఉత్సవాలే లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఏసీపీ వెంకటేశ్వర్లు

చెన్నూర్, సెప్టెంబర్ 4:ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను మతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మత సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.

చెన్నూర్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక మార్వాడి భవన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా స్వయంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసుల సహకారంతో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు.

నిమజ్జనం సందర్భంగా పోలీసులకు సహకరించాలి:
వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శాంతి యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు యువత, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఏసీపీ కోరారు. నిబంధనల ప్రకారం క్రమసంఖ్యను పాటిస్తూ ర్యాలీని నిర్వహించుకోవాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఏసీపీ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, సీఐ బన్సీలాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు అజీమ్, సంతోష్, కో-ఆప్షన్ సభ్యుడు సాధనబోయిన కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, బ్రహ్మయ్య, శాంతి కమిటీ నాయకులు బి. జనార్దన్ రావు, బొల్లంపల్లి లక్ష్మీరాజ గౌడ్, పట్టణంలోని వివిధ కుల సంఘాల నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular