* పుస్తక పఠనంతో విజ్ఞానం.. లక్ష్య సాధనకు కృషి చేయాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
* పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో హాజరు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థలో తెలుగు భాష పరిరక్షణ సంఘం–తెలంగాణ, విఎన్నార్ ఫౌండేషన్, అల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కెప్టెన్ బి. మధుసూదన్ రెడ్డి రచించిన ‘మధుపాళీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశం విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని జీవితంలో అనేక విజయాలను సాధించవచ్చన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారు అగ్రగామిగా నిలుస్తారని పేర్కొన్నారు.
ప్రముఖుల హాజరు
కార్యక్రమానికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ ఉపకులపతి ఆచార్య అనిశెట్టి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశంతో పాటు తెలంగాణ భాషా పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజా దేవి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
పుస్తక పఠనం ప్రాధాన్యత, తెలుగు భాష పరిరక్షణ, పోటీ పరీక్షలకు సన్నద్ధత వంటి అంశాలపై కార్యక్రమంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు.

