— పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యుత్తమ డిజైన్లతో తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్: నగరంలోని మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను ఒక్కొక్కటిగా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా అత్యుత్తమ డిజైన్లతో మీరాలం ట్యాంక్‌ను అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న పనులకు సంబంధించిన ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి ప్రణాళికలు, పురోగతిని వివరించారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన అనంతరం సీఎం పలు సూచనలు చేశారు.
నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ సీఎం పరిశీలించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి పరిశీలించారు.
చెరువులోకి మురుగునీరు చేరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.. చెరువు నుంచి మూసీలోకి వరద నీరు సులభంగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు.
పర్యాటకుల కోసం చెరువులో వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను ఏర్పాటు చేసేలా డిజైన్ రూపొందించాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున మీరాలం ట్యాంక్‌తో పాటు పరిసర ప్రాంతాలను కూడా పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన సందర్భంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

