— ఆపరేషన్స్ డైరెక్టర్‌తో కీలక అంశాలపై రివ్యూ మీటింగ్
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, సింగరేణి ప్రాంత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సింగరేణి సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే సమగ్రంగా సమీక్షించారు. సింగరేణి కార్యకలాపాల పురోగతి, అభివృద్ధి పనులు, కార్మికులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, భద్రతా చర్యలు, పెండింగ్ పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.
సింగరేణి ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు, భద్రత, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజ్ ఠాకూర్ సూచించారు. రామగుండం ప్రాంత సమగ్ర అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, ఆర్‌జీ–1 జనరల్ మేనేజర్, ఆర్‌జీ–2 జనరల్ మేనేజర్, ఏసీపీ, ఎంఆర్‌ఓతో పాటు సింగరేణి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

