Saturday, August 29, 2026

Buy now

సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర అగ్నిప్రమాదం

– ట్రక్కు-కారు ఢీకొని ఆరుగురు సజీవదహనం

మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురి ప్రాణాలను బలిగొంది. వర్ధా జిల్లా విరుల్‌ గ్రామం సమీపంలో ట్రక్కు, కారు ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు, ట్రక్కులో ఉన్న ఇద్దరు సజీవదహనమయ్యారు. ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అధికారుల వివరాల ప్రకారం.. ఐసీ-80 ఇంటర్‌చేంజ్‌ సమీపంలో ఎథనాల్‌ను తరలిస్తున్న కంటైనర్‌ ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో రోడ్డుపై నిలిచిన కారును వెనుక నుంచి మరో ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాటిలో ఉన్నవారు బయటపడే అవకాశం లేకపోయింది.

సమాచారం అందుకున్న హైవే సేఫ్టీ పెట్రోల్‌, వర్ధా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌ఆర్‌డీసీ) అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన ట్యాంకర్‌లో అత్యంత మండే స్వభావం కలిగిన ఎథనాల్‌ ఉండటంతో ముందుగా దానిని సురక్షితంగా ఖాళీ చేసిన తర్వాతే ట్యాంకర్‌ను తొలగించే ప్రక్రియ చేపట్టారు.

ప్రమాదం నేపథ్యంలో ముంబై–నాగ్‌పూర్‌ మార్గంలో వాహనాలను ఎదురులేన్‌కు మళ్లించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నాగ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్లే వాహనదారులు కొంతసేపు సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేను ఉపయోగించకుండా నాగ్‌పూర్‌–అమరావతి జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి అమరావతి ఇంటర్‌చేంజ్‌ వద్ద తిరిగి ఎక్స్‌ప్రెస్‌వేలోకి చేరాలని పోలీసులు సూచించారు.

ఇదిలా ఉండగా, సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2025లో ఈ రహదారిపై 185 ప్రమాదాలు నమోదుకాగా, 2024లో ఈ సంఖ్య 137 మాత్రమే. ఏడాది వ్యవధిలో ప్రమాదాలు 35 శాతం పెరగడంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular