– రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
– మూడు జిల్లాల్లో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అప్రమత్తత ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ జారీ చేయడంతో కాంగ్రా, మండీ, సిర్మౌర్ జిల్లాల్లో జూలై 20, 21 తేదీల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐలు, వృత్తి, సాంకేతిక శిక్షణా కేంద్రాలు, అంగన్వాడీలు, డే కేర్ కేంద్రాలు, కాంగ్రాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు సంస్కృత విశ్వవిద్యాలయం కూడా మూసివేయనున్నారు. ఈ రెండు రోజుల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా–చిట్కుల్ మార్గంలో టుబార్ నాలాలో ఆదివారం ఆకస్మిక వరదలు సంభవించి తీవ్ర నష్టం కలిగించాయి. టిబెట్ సరిహద్దును ఉత్తరాఖండ్‌తో అనుసంధానించే కీలక రహదారి పూర్తిగా దెబ్బతినగా, టుబార్ నాలాపై ఉన్న వంతెన కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో సైన్యం, ఐటీబీపీ ముందస్తు స్థావరాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలేశ్ కుమార్ పంత్ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా అత్యవసర నియంత్రణ కేంద్రాలను 24 గంటలూ అందుబాటులో ఉంచడంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హోంగార్డులు, అగ్నిమాపక, పోలీసు, అంబులెన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ప్రజలు నదులు, వాగులు, వరద ప్రవాహాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, నీటితో నిండిన రహదారులు లేదా వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర హెల్ప్‌లైన్ 1070, జిల్లా అత్యవసర హెల్ప్‌లైన్ 1077ను సంప్రదించాలని సూచించారు.

