– ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. ఐదు మెట్రో స్టేషన్లు మూసివేత
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) సోమవారం ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు డీఎంఆర్సీ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. అయితే ఈ ర్యాలీ నిర్వహణకు తమ వద్ద ఎలాంటి అనుమతి కోరలేదని అధికారులు వెల్లడించారు. నిరసన కార్యక్రమం దృష్ట్యా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

